ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద పీపీపీ…

0
834

Times of Nellore ( Visakhapatnam ) – సుమారు 43 కిలోమీటర్ల పొడవు, 3 కారిడార్లు.. పీపీపీ విధానంలో విశాఖ మెట్రో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా ప్రఖ్యాతి గడించనుంది. ఇదే తరహాలో ఇప్పటికే హైదరాబాదులో 72 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన మెట్రో ప్రాజెక్టు మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత విశాఖలోనే ఇలాంటి ప్రాజెక్టు చేపడుతున్నట్లు అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం వుడా ఉద్యోగ్‌భవన్‌లో విశాఖ మెట్రో ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించారు. దీనికి జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్‌, మలేషియా, ఇటలీతో పాటు భారతదేశ ప్రముఖ కంపెనీలన్నీ కలిపి 17 వరకు పాల్గొన్నాయి. ఆసక్తి వ్యక్తీకరణ పద్ధతిలో పిలిచిన టెండర్లకు డిసెంబరు 15వరకు గడువు ఇచ్చారు. ఈలోపు ఆసక్తి చూపిస్తున్న కంపెనీల్లో ఈ మెట్రోపై నెలకొన్న సందేహాల్ని నివృత్తి చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖ మెట్రో పనులకు త్వరలోనే కంపెనీ ఖరారవుతుంది. గడువు ముగిసేలోపు మరోసారి సమావేశం కానున్నట్లు ఆయన వివరించారు. సీఎంతో సమాలోచనలు చేసిన తర్వాత పీపీపీ విధానమే ఉత్తమమని నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రయాణికులకు సౌకర్యంగా.. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల్ని బట్టి.. విశాఖ మెట్రో మీద అధికారులు తెరపై ప్రదర్శన ఇచ్చారు. ఇందులో ముఖ్యాంశాల్ని చూస్తే..
మెట్రో ప్రాజెక్టులోని 3 కారిడార్లలో ప్రయాణికులు ఏ మెట్రో రైల్వేస్టేషన్‌లో కూర్చున్నా.. ప్రతీ 7 నిమిషాలకు ఒక రైలు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఒక్కో రైలుకు 3 నుంచి 4 బోగీలుంటాయి. ఇందులో ప్రతీ బోగీలోనూ 200 మంది ప్రయాణికులు పట్టే సామర్థ్యం ఉంది. ప్రాజెక్టులో పిల్లర్లు, ఇతర నిర్మాణ వ్యయం రూ. 4500 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఇతర సాంకేతిక సామగ్రి, రైలుబోగీలు, పట్టాలు, ఇతరత్రా అవసరాల కోసం ఏర్పాటు చేసేవన్నీ.. ఆసక్తి చూపే కంపెనీలు భరించనున్నాయి. మొత్తం ప్రాజెక్టు విలువ రూ. 8,800 కోట్లు.
ఈ ప్రాజెక్టులో ఒకే కంపెనీనే అని కాకుండా.. రెండు, మూడు కంపెనీలు చేతులు కలిపి ఒకే బిడ్‌ వేసేందుకు అవకాశం ఉంటుంది.
ఆసక్తి చూపిస్తున్న కంపెనీలివి..
మన దేశం నుంచి.. అదానీ, అఫ్కాన్స్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ రైల్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, యూనిరైల్‌, 3ఐఈపీ, టాటా రియాలిటీ కంపెనీలు ఉన్నాయి. విదేశీ కంపెనీల పరంగా చూస్తే.. సీమెన్స్‌ (జర్మనీ), అల్‌స్టామ్‌ (ఫ్రాన్స్‌), హుందాయ్‌ (దక్షిణ కొరియా), మిట్సుయీ (జపాన్‌), కెఎఫ్‌డబ్ల్యూ-ఐపీఈఎక్స్‌ (జర్మనీ), ఓరిక్స్‌ (జపాన్‌), ప్రసరణ (మలేషియా), అన్సాల్డో (ఇటలీ), బంకర్‌ ఇన్వెస్టిమెంట్స్‌ (దక్షిణ కొరియా) కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి కరికాల్‌ వలవెన్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి షాలిమ్‌రాజు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY