స్వామి నిత్యానందకు హైకోర్టు సీరియస్ వార్నింగ్…

0
323

Times Of Nellore ( Bengaluru ) – బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలో మకాం వేసిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందపై మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం కన్నెర్ర చేసింది. మీ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వమంటారా అంటూ నిత్యానందను ఉద్దేశించి న్యాయమూర్తి జస్టిస్‌ మహాదేవన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు అంటే మీకు లెక్కలేదా, మీ మీద ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని న్యాయమూర్తి మహాదేవన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టులో వాదనలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా నిత్యానందకు చేరవేస్తున్న ఆయన శిష్యుడు నరేంద్రన్‌ను అరెస్టు చేయాలని న్యాయమూర్తి మహాదేవన్ ఆదేశించారు. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన మదురై మఠాన్ని చేజిక్కించుకునేందుకు నిత్యానంద కొంత కాలంగా తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. మదురైలోని మఠానికి తానే 293 ఆధీనంగా (మఠాధిపతి) నిత్యానంద ప్రకటించుకున్నాడు. మదురైకి చెందిన ప్రతాపన్ అనే వ్యక్తి నిత్యానంద అడ్డదారిలో ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మదురై మఠాన్ని అడ్డదారిలో స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, దానిని అడ్డుకోవాలని మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు.

మదురై 292 ఆధీనం జీవించి ఉండగానే 293 ఆధీనం ఎలా తెరమీదకు వస్తారు, ఈ విషయంలో వివరణ ఇవ్వాలని గత ఏడాది మదురై ధర్మాసనం నిత్యానందకు ఆదేశాలు జారీ చేసింది. అయితే నిత్యానంద ఇంత వరకు కోర్టు ఆదేశాలకు సరైన వివరణ ఇవ్వలేదు. ప్రతాపన్ సమర్నించిన పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో వివరణ ఇవ్వడానికి తమకు మరింత సమయం కావాలని నిత్యానంద న్యాయవాది కోర్టులో మనవి చేశారు. ఒక సంవత్సరం సమయం ఇచ్చాము, ఇంకా సమయం కావాలని అడుగుతున్నారు, నిత్యానందను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచమంటారా అని న్యాయమూర్తి మహాదేవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యానంద మీద ప్రతినిత్యం ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి, కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచవలసి వస్తోంది జాగ్రత్త అంటూ న్యాయమూర్తి మహాదేవన్ హెచ్చరించారు. కేసు విచారణ ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేశారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో వాదనలు ఎలా జరుగుతున్నాయి అనే పూర్తి సమాచారాన్ని నిత్యానందకు ఎప్పటికప్పుడు ఎస్ఎమ్ఎస్ ల ద్వారా చేరవేస్తున్న ఆయన శిష్యుడు నరేంద్రన్ ను కోర్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే న్యాయమూర్తి మహాదేవన్ కు సమాచారం ఇవ్వడంతో అతన్ని అరెస్టు చెయ్యాలని అక్కడే ఉన్న పోలీసులకు న్యాయమూర్తి మహాదేవన్ ఆదేశాలు జారీ చేశారు.

SHARE

LEAVE A REPLY