కర్ణాటకలో కొనసాగుతోన్న రాజకీయ సంక్షోభం!

0
225

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. నేడు కూడా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ మధ్య సంప్రదింపుల ప్రక్రియను కొనసాగించనున్నారు. రాజీనామా చేసిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ నిర్ణయం తీసుకోనున్నారు. రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. సీఎంను మార్చినా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని వారు ఉద్ఘాటించారు. సీఎం పదవి నుంచి వైదొలిగేది లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు శనివారం.. స్పీకర్‌కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు.

కాగా, ఇప్పటి వరకూ ఆనంద్‌ సింగ్‌తో కలిపి సంకీర్ణ ప్రభుత్వానికి 14 మంది ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పినట్టు జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నప్పటికీ, తమకు 13 మంది ఎమ్మెల్యేల (ఆనంద్‌ సింగ్‌తో కలిపి) రాజీనామా పత్రాలు మాత్రమే అందాయని స్పీకర్‌ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్‌ సభ్యులు 11 మంది, జేడీఎస్‌ నుంచి ముగ్గురు ఉన్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, బీఎస్పీ 1, స్వతంత్రులు రెండు సీట్లలో గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ (113) ఎవరికీ రాకపోవడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ జట్టుకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అయితే ఆనంద్‌సింగ్‌ రాజీనామాతో కూటమి బలం 116కి పడిపోయింది. తాజాగా మరో 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో బలం 103కి తగ్గిపోయింది. రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.

SHARE

LEAVE A REPLY