ఐపీఎల్ తర్వాతే ఆల్ స్టార్స్ మ్యాచ్.. ఒకే జట్టులో ధోని, విరాట్, రోహిత్‌లు..?

0
55

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-ఐపీఎల్ 2020కి ఎన్నో సర్‌ప్రైజ్‌లను బీసీసీఐ సిద్ధం చేసింది. అందులో భాగంగానే టోర్నమెంట్‌కు ముందు ఆల్- స్టార్స్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆటగాళ్ల గాయాల బెడద, బిజీ షెడ్యూల్స్‌తో ఎవరు అందుబాటులో ఉంటారో చెప్పలేమని ఫ్రాంచైజీలు చేతులెత్తేశాయి. దీనితో ఈ మ్యాచ్ దాదాపు రద్దయిందని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ సీజన్ చివర్లో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించి.. రెండు జట్లుగా విభజించి ఆల్- స్టార్స్ మ్యాచ్‌ను నిర్వహిస్తామని ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు.

ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాము ఆల్- స్టార్స్ మ్యాచ్ రద్దు చేయట్లేదని.. కేవలం టోర్నమెంట్ చివరికి వాయిదా వేశామని చెప్పారు. ఏయే ఆటగాళ్ల ఎలాంటి ప్రదర్శనను కనబరుస్తారో చూసి.. ఫామ్ బట్టి జట్లను విభజిస్తామని బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు.

ఇక ఫ్యాన్స్‌కు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నార్త్, ఈస్ట్(ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌) ఫ్రాంచైజీలు ఒక జట్టు గానూ.. సౌత్, వెస్ట్(చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్) ఫ్రాంచైజీలు మరో జట్టుగా కలిసి ఆడనున్నాయని తెలుస్తోంది.

ఈ మ్యాచ్‌లో.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, డివిలియర్స్, బుమ్రా, మలింగా వంటి స్టార్ ప్లేయర్లు ఒకే టీమ్ తరపున ఆడనున్నారు. అంతేకాక రస్సల్, పంత్, స్టోక్స్, బట్లర్, శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్, మోర్గాన్, స్టీవ్ స్మిత్‌లను మరొక జట్టులో చూడవచ్చు. గుజరాత్‌ మోటారా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని సమాచారం.

SHARE

LEAVE A REPLY