గ్రామీణ బ్యాంకులకు రూ.670 కోట్ల ఆర్థిక సాయం!!

0
89

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు (ఆర్‌ఆర్‌బీలు) మూలధన అవసరాల నిమిత్తం రూ.670 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు (రీకేపిటలైజేషన్‌ ప్లాన్‌) కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఆర్‌బీలు కనీస నియంత్రణ మూలధనం నిర్వహించేలా ఈ సాయం తోడ్పడనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం, కేపిటల్‌ రిస్క్‌ వెయిటెడ్‌ అసెట్స్‌ రేషియో (సీఆర్‌ఏఆర్‌) 9 శాతం ఉండాలి. దీనికి అనుగుణంగా లేని ఆర్‌ఆర్‌బీలకు ఈ ఆర్థిక సాయం అందనుంది. ‘ఆర్‌ఆర్‌బీల రీకేపిటలైజేషన్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన రూ.1,340 కోట్లలో 50 శాతం అంటే రూ.670 కోట్లు అందించనున్నాం. ప్రాయోజిత బ్యాంకులు కూడా వారి దామాషా పద్ధతిలో వాటా నిధులు విడుదల చేయాల్సి ఉంద’ని ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారి ఒకరు తెలిపారు. ఆర్‌ఆర్‌బీల్లో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉండగా, 35 శాతం ప్రాయోజిత బ్యాంకులకు, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉంది.

SHARE

LEAVE A REPLY