ఎస్‌బీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్…

0
447

Times of Nellore ( Mumbai ) – 25 కోట్ల మంది ఖాతాదారులకు ఊరటనిచ్చేలా భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. సేవింగ్ ఖాతాల్లో కనీస నిల్వలు పాటించని కస్టమర్లకు విధించే పెనాల్టీ చార్జీలను 70 శాతం వరకు తగ్గించింది. సవరించిన చార్జీలు వచ్చేనెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్బీఐ తాజా నిర్ణయంతో మెట్రో, అర్బన్ కేంద్రాల్లో ప్రస్తుతం విధిస్తున్నచార్జీలు రూ.50 నుంచి రూ.15కు తగ్గనున్నాయి.

సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.40 వరకు నాన్ మెయింటెనెన్స్ చార్జీలు విధిస్తున్నారు. తాజాగా సెమీ అర్బన్ కస్టమర్లకు రూ.12, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వరకు చార్జీలు విధించనున్నారు. అయితే ఈ చార్జీలకు యధావిధిగా జీఎస్టీ అదనంగా ఉంటుంది. బ్యాంకు లాభాల ద్వారా వచ్చే ఆదాయం కంటే పెనాల్టీ చార్జీల ద్వారా వచ్చే ఆదాయమే అధికంగా ఉన్నట్టు వెలుగుచూడడంతో ఎస్బీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. విద్యార్థులు, నిరుపేదలకు చెందిన ఖాతాలను సైతం రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలుగా పరిగణించడంతో భారీగా నష్టపోతున్నారు.

ఈ నేపథ్యంలో కస్టమర్ల నుంచి వస్తున్న సూచనలు, మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చార్జీలను తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది. రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు ఖాతా నుంచి ఎటువంటి చార్జీలు పడకుండా ఉండే బేసిక్ సేవింగ్స్ ఖాతాల్లోకి మారేందుకు కూడా కస్టమర్లకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఎస్బీఐకి మొత్తం 41 కోట్ల సేవింగ్స్ ఖాతాలుండగా.. అందులో 16 కోట్ల వరకు జన్‌థన్ ఖాతాలు, బేసిక్ ఖాతాలే ఉన్నాయి. ఈ ఖాతాలకు కనీస నిల్వల నిబంధన లేదు.

SHARE

LEAVE A REPLY