కొత్తగా పెళ్ళైన జంటలు.. మాస్కులతోనే ముద్దులు..!

0
43

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- చైనాలో 2వేలకు పైగా ప్రజలను బలిగొన్న కరోనా వైరస్‌ మరో 26 దేశాల్లో విజృంభిస్తోన్న సంగతి విదితమే. ఫిలిప్పైన్స్‌లో వాలంటైన్స్‌ డే అనంతరం సామూహిక వివాహాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా బాకోలోడ్‌ పట్టణంలో సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టింది స్థానిక ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 220జంటలు ఒక్కటయ్యాయి. నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులతో ఆ వేడుక జరిగే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లని వస్త్రాలు ధరించిన నూతన వధూవరులతో ఆ ప్రదేశం శ్వేతమయం అయ్యింది.

కాగా.. వారి ముఖాలకు నీలి రంగు మాస్కులు ఉండడంతో అక్కడ కొత్త వాతావరణం ఏర్పడింది. ఇలా ధరించిన మాస్కులతోనే వివాహం చేసుకున్న నూతన దంపతులు, వారి మొదటి చుంబనంతో భాగస్వామిపై ప్రేమను వ్యక్తం చేయడం అందర్నీ ఆకర్షించింది. వివాహ జీవితాన్ని ఇలా జాగ్రత్త పాటిస్తూ ఆరంభించడం సంతోషంగా ఉందన్నారు. మాస్కుతో ముద్దు పెట్టుకోవడం వింత అనుభూతినిచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కొందరు నూతన దంపతులు.

కరోనా విజృంభణ నేపథ్యంలో.. వివిధ దేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వారిని నిశితంగా పరిశీలించి 14 రోజుల గడువు అనంతరం మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిచ్చామన్నారు నిర్వాహకులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీనిలో పాల్గొనే ప్రతిఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాస్కులు అందించిన అధికారులు తమ పట్టణం ఆరోగ్యంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ పట్టణంలో 2013 సంవత్సరంలో దాదాపు 2013 జంటలు ఒక్కటై రికార్డు సృష్టించాయి.

SHARE

LEAVE A REPLY