కేరళకు కేంద్ర సాయం రూ.500కోట్లు

0
332

Times of Nellore ( Kerala ) – భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి రూ. 500కోట్ల సహాయనిధిని ప్రకటించారు. శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాని ఈ ప్రకటనను వెల్లడించారు. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో మోదీ ఏరియల్‌ సర్వే చేపట్టారు.

కేరళలో వరదల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం తిరువనంతపురం చేరుకున్నారు. అక్కడి నుంచి ఈ ఉదయం కోచి వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం కోచి నావెల్‌ బేస్‌ నుంచి బయల్దేరి ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే చేపట్టాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే విమానం వెనక్కి వచ్చింది. దీంతో సీఎం, అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి తక్షణమే రూ.500కోట్ల సహాయనిధిని అందించనున్నట్లు తెలిపారు. అయితే పరిస్థితి తీవ్రంగా ఉన్న దృష్ట్యా తమకు రూ. 2000కోట్లు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్‌ చేసినప్పటికీ.. రూ. 500కోట్లే ఇస్తామని ప్రకటించడం గమనార్హం. వరదల కారణంగా కేరళ ఇప్పటివరకు రూ.10వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.

అంతేగాక వరద బాధితులకు పీఎం జాతీయ సహాయ నిధి నుంచి నష్టపరిహారం కూడా మోదీ ప్రకటించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ. 50,000 చొప్పున నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. అనంతరం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వేను చేపట్టారు.

గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ జలదిగ్బంధంలో కూరుకుపోయింది. ఎటుచూసిన వరదనీరే కన్పిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే వర్షాల సంబంధిత ఘటనల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. నేడు కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

SHARE

LEAVE A REPLY