జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తుందా..?

0
286

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒–జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్‌తో కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు ఫ్రెంచ్ పరిశోధకులు. తియ్యటి పానీయాలతో క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు.సుమారు లక్ష మందిపై ఐదేళ్ల పాటు నిర్వహించిన అధ్యయనం ఆధారంగా సోర్బోన్ పారిస్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఆ అధ్యయన ఫలితాలు బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్లే ఇలా జరుగుతుండొచ్చని పరిశోధకులు అంటున్నారు.ఈ అధ్యయనం కచ్చితంగా ఏమీ తేల్చిచెప్పలేదని, ఈ అంశంపై మరింత లోతుగా పరిశోధనలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐదు శాతానికి మించి చక్కెరను కలిగిన డ్రింక్స్‌ను పరిశోధకులు తియ్యటి పానీయాలుగా పరిగణనలోకి తీసుకున్నారు. జ్యూస్‌లు (చక్కెర కలపనివి కూడా), సాఫ్ట్ డ్రింక్స్, మిల్క్‌షేక్‌లు, ఎనర్జీ డ్రింక్స్, చక్కెర కలిపిన ఛాయ్, కాఫీలను తియ్యటి పానీయాలుగానే లెక్కలోకి తీసుకున్నారు.

చక్కెరకు బదులు జీరో క్యాలరీ స్వీటెనర్స్ ఉండే డ్రింక్స్‌పైనా ఈ అధ్యయనంలో పరిశోధకులు దృష్టి సారించారు. వాటితో క్యాన్సర్‌కు సంబంధమేమీ ఉన్నట్లు తేలలేదు.

రోజూ 100 మిల్లీ లీటర్ల తియ్యటి పానీయాలను అదనంగా తీసుకుంటే, క్యాన్సర్ ముప్పు 18% పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది.అధ్యయనంలో పాల్గొన్న ప్రతి వెయ్యి మందికి 22 మంది క్యాన్సర్‌కు గురయ్యారు.ఒకవేళ వెయ్యి మందిలో అందరూ ఇలా రోజూ 100 మిల్లీ లీటర్ల తియ్యటి పానీయాలను అదనంగా తీసుకుంటే, ఐదేళ్లలో వారిలో 26 మంది క్యాన్సర్ బారిన పడతారని పరిశోధకులు అంచనా వేశారు.తియ్యటి పానీయాలకు, క్యాన్సర్‌కు మధ్య వాస్తవంగా లంకె కనిపిస్తున్నా, మరింత లోతుగా పరిశోధనలు జరగాలని యునివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నిపుణుడు గ్రాహమ్ వీలర్ అన్నారు.అధ్యయనంలో గుర్తించిన 2,193 క్యాన్సర్లలో 693 రొమ్ము, 291 ప్రోస్టేట్, 166 పేగు క్యాన్సర్లు ఉన్నాయి.

తియ్యటి పానీయాలు, క్యాన్సర్ మధ్య సరళులు గుర్తించేందుకే ఈ అధ్యయనం జరిగింది. వాటి వెనుకున్న కారణాలేంటో అది వివరించలేదు.తియ్యటి పానీయాలు తక్కువ (రోజుకు 30 ఎం.ఎల్‌కు మించకుండా) తాగేవారి కన్నా, ఎక్కువ (రోజుకు 185 ఎం.ఎల్ దాకా) తాగేవారిలో ఎక్కవ మంది క్యాన్సర్ బారిన పడ్డట్లైతే తేల్చింది.అలా అని క్యాన్సర్‌లకు తియ్యటి డ్రింక్సే కారణమని కూడా అధ్యయనం నిర్ధారించలేదు. తియ్యటి పానీయాలు తీసుకునేవారికి ఇతర అనారోగ్యకర ఆహారపు అలవాట్లు ఉండొచ్చు. వాటి వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పెరిగి ఉండొచ్చు.ఆహారంలో చక్కెర తీసుకోవడం తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం మరోసారి గుర్తు చేసిందని టెస్సైడ్ వర్సిటీ ప్రొఫెసర్ అమీలియా లేక్ అన్నారు.

కొన్ని రకాల క్యాన్సర్లకు ఊబకాయం ప్రధాన కారణం. తియ్యటి పానీయాలను అతిగా తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

”మా అధ్యయన ఫలితాల్లో ఊబకాయం ప్రభావం కూడా కనిపించింది. తియ్యటి పానీయాల వల్ల క్యాన్సర్ ముప్పు పెరగడానికి అదొక్కటే కారణమని మాత్రం తేలలేదు” అని పరిశోధకుల్లో ఒకరైన మాథిల్డ్ టౌవియర్ చెప్పారు.

తియ్యటి పానీయాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, వాటిలో రంగు కోసం వాడే కొన్ని రసాయనాలు క్యాన్సర్ ముప్పును పెంచుతుండొచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

”తియ్యటి పానీయాల వల్ల హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం ముప్పు పెరుగుతందని ఇదివరకు అధ్యయనాలు తేల్చాయి. మా అధ్యయనం క్యాన్సర్ ముప్పు కూడా ఉండొచ్చని సూచిస్తోంది. అలాంటి డ్రింక్స్‌ను తీసుకోవడం తగ్గిస్తే మంచిది. చక్కెర ఎక్కువ ఉండే ఉత్పత్తులపై అధిక పన్నులు, మార్కెటింగ్ ఆంక్షలు విధించడం ద్వారా పరిస్థితిని కట్టడి చేయొచ్చు” అని పరిశోధకులు చెప్పారు.

ఆరోగ్యకరమైన డైట్‌లో భాగంగా సాఫ్ట్ డ్రింక్స్‌ను తీసుకోవచ్చని, వాటి వల్ల ప్రమాదం లేదని బ్రిటీష్ సాఫ్ట్ డ్రింక్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ గేవిన్ పార్టింగ్టన్ అన్నారు.

అధ్యయనం నిర్వహించినవారు కూడా క్యాన్సర్‌కు తియ్యటి పానీయాలు కారణమవుతున్నాయని చెప్పడం లేదని గుర్తు చేశారు.

”ఊబకాయ సమస్యను కట్టడి చేయాల్సిన బాధ్యతను సాఫ్ట్ డ్రింక్స్ పరిశ్రమ కూడా తీసుకుంది. క్యాలరీలు, చక్కెర స్థాయిలను తగ్గించి ఉత్పత్తులను తయారుచేయడంలో చాలా ముందడుగు వేసింది” అని పార్టింగ్టన్ అన్నారు.

 

 

SHARE

LEAVE A REPLY