రెడ్‌లైట్ ఏరియాలకు అమ్మాయిలు: అస్సాం టాప్, వరుసలో తెలంగాణ

0
969

Times Of Nellore ( గౌహతి ) -దేశంలో ప్రస్తుతం మానవ అక్రమ రవాణా పెను సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఈ సమస్య తీవ్రతను మాత్రం తగ్గించలేకపోతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లోని అమ్మాయిలను చిన్నతనంలో కిడ్నాప్ చేయడం, లేదా మాయమాటలు చెప్పి కొనుగోలు చేయడం ద్వారా వారిని వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. దేశంలోనే గాక, విదేశాలకు కూడా వీరిని తరలిస్తుండటం ఆందోళన కలిగించే అంశం కాగా, అమ్మాయిల అక్రమ తరలింపులో అస్సాం రాష్ట్రం అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. దేశంలోని పలు రెడ్‌లైట్ ప్రాంతాల్లో సాగుతున్న వ్యభిచార కేంద్రాల్లో అస్సాం అమ్మాయిలను హాట్ కేకుల్లా విక్రయిస్తున్నారని ఇటీవల జరిగిన ఉదంతాలు చెబుతున్నాయి.

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని రెడ్‌లైట్ ప్రాంతంలో పోలీసులు దాడులు చేసి అసోంకు చెందిన ఓ 12ఏళ్ల అమ్మాయిని వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. ఆ అమ్మాయిని సాక్షాత్తు అమ్మమ్మే ఢిల్లీకి తీసుకువచ్చి వ్యభిచార ముఠాకు విక్రయించిందనే చేదు వాస్తవం పోలీసుల దర్యాప్తులో తేలింది.

అస్సాం రాష్ట్రంలోని కొక్రాఝర్ జిల్లాకు మరో అమ్మాయిని నేపాల్‌కు తీసుకువెళ్లి అక్కడినుంచి తప్పుడు పత్రాలతో సౌదీఅరేబియాకు తరలించారని తేలింది. సౌదీలో 8ఏళ్ల పాటు వ్యభిచారం సాగించిన ఆ అమ్మాయిని రక్షించి 2013లో స్వస్థలానికి తరలించారు పోలీసులు. ఇలా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై లాంటి నగరాలతోపాటు నేపాల్, సౌదీ లాంటి ఇతర విదేశాల్లోనూ అస్సాం అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసి వారిని వ్యభిచార కూపంలో దించారనే వాస్తవాలు తాజా అధ్యయనాల్లో వెల్లడయ్యాయి.

అమ్మాయిల అక్రమ రవాణా కేంద్రంగా అస్సాం

జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన నివేదికలో అస్సాం(అసోం) అమ్మాయిల అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందని స్పష్టం అయింది. అసోంలో నమోదైన 1494 కేసుల్లో 22 శాతం అమ్మాయిల అక్రమ రవాణా కేసులని తేలింది. దేశంలోనే అత్యధికంగా 38 శాతం అంటే 1,317 బాలికల అక్రమ రవాణా కేసులు అసోంలోనే నమోదవడంపై మహిళా, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించిన లెక్కల కంటే రెట్టింపు మంది అమ్మాయిలు వ్యభిచార రొంపిలో దింపుతున్నారని స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు అంటున్నారు.

రోజుకు నలుగురైదుగురు బాలికల అదృశ్యం

అసోంలోని 8 జిల్లాల్లో ప్రతిరోజూ నలుగురైదుగురు బాలికలు అదృశ్యమవుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయని నేదాన్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ దిగంబర్ నేర్జరీ తెలిపారు. పేదరికం, నిరక్షరాస్యత వల్ల గిరిజన కుటుంబాలకు చెందిన అమ్మాయిలు వ్యభిచార రొంపిలో దిగుతున్నారని దిగంబర్ వివరించారు. కాగా, అసోంలో తరచూ వరదలు, తీవ్రవాదం, పేదరికం, నిరుద్యోగ సమస్యల వల్ల కూడా అసోం అమ్మాయిలు వ్యభిచార కూపాల్లో చిక్కుకుంటున్నారని తెలుస్తోంది. అమ్మాయిల అక్రమ రవాణాకు తెరవేసేందుకు అసోం సీఎం తన అధ్యక్షతన ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినా అక్రమ రవాణా సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగించే విషయమే. మానవ అక్రమ రవాణా అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా కలిసి వస్తేనే ఈ సమస్యకు చరమగీతం పాడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు

ఇది ఇలా ఉండగా, పశ్చిమబెంగాల్(1255కేసులు), తమిళనాడు(577), తెలంగాణ(561), కర్ణాటక (507), మహారాష్ట్ర (421) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 274 కేసులతో అస్సాం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

SHARE

LEAVE A REPLY