జైల్లోనే ఉంటానని అనుకున్నారా?

0
366

Times of Nellore (Mumbai) – కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌కు జోధ్‌పూర్‌ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండు రోజులు జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో గడిపిన సల్మాన్‌ ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వచ్చారు. సల్మాన్‌కు శిక్ష పడిందని తెలిసి ఆయనతో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలకు ముచ్చెమటలు పట్టాయి. కానీ సల్మాన్‌ బెయిల్‌పై బయట ఉన్నంత వరకు తన ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు.

కాగా.. సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘రేస్‌ 3’ ట్రైలర్ మంగళవారం‌ విడుదలైంది. ఈ సందర్భంగా ముంబయిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సల్మాన్‌ పాల్గొన్నారు. సమావేశంలో ఓ విలేకరి సల్మాన్‌ను కృష్ణజింకల కేసు గురించి ప్రశ్నించారు. దీనికి సల్మాన్‌ జవాబిస్తూ..‘జీవితాంతం జైల్లోనే ఉంటానని అనుకున్నారా?’ అని విలేకరిని అడిగారు. ఇందుకు ఆ విలేకరి లేదు అని సమాధానమిచ్చాడు. దాంతో సల్మాన్‌..‘ధన్యవాదాలు. ఎందుకంటే ఆ కేసు గురించి నేను బాధపడటంలేదు’ అని తెలిపారు. అనంతరం కథువా అత్యాచార ఘటన గురించి స్పందిస్తూ..‘ఎలాగైనా మున్ముందు ఇలాంటి ఘోరాలు జరగకుండా చూడాలి’ అన్నారు.
మరోపక్క సల్మాన్ తనకు వేసిన శిక్షను కొట్టివేయాల్సిందిగా జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో అభ్యర్థన పెట్టుకున్నారు. ఈ కేసును న్యాయస్థానం జులైకు వాయిదా వేసింది. సల్మాన్‌ నటించిన ‘రేస్‌ 3’ సినిమాకు రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌, డైసీ షా, సకీబ్‌ సలీం, సన్నీ డియోల్‌ కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE

LEAVE A REPLY