స్లిమ్మింగ్‌ పిల్స్‌ ప్రకటనకు నో చెప్పిన శిల్ప!

0
118

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –ఒక్కసారి పాపులారిటీ వచ్చాక తారలు ఇక యాడ్స్‌ మీద దృష్టి పెడతారు. సెకన్ల వ్యవధి మాత్రమే ఉండే యాడ్స్‌కి కోట్లలో పారితోషికం లభిస్తుండటంతో స్టార్‌ హీరోలు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్‌ సాయి పల్లవి ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్‌ ఆఫర్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 2 కోట్లు ఇస్తామన్నా సరే ఆ యాడ్‌ చేయడానికి సాయి పల్లవి అంగీకరించలేదు. తాను ఇలాంటి ఉత్పత్తులను వాడనని.. అలాంటిది సదరు ఉత్పత్తులు వాడమని జనాలకు ఎలా చెప్తానని సాయి పల్లవి ప్రశ్నించారు.

తాజాగా ఈ జాబితాలో హీరోయిన్‌ శిల్పాశెట్టి కూడా చేరారు. ఈ నటి ఏకంగా రూ. పది కోట్ల ఆఫర్‌ను వదులుకున్నట్లు సమాచారం. వివరాలు.. ఓ స్లిమ్మింగ్‌ పిల్స్‌ కంపెనీ వారు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం శిల్పను సంప్రదించారట. అంతేకాక ఈ యాడ్‌లో నటించేందుకు గాను రూ.10 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారట. కానీ శిల్ప దీనికి అంగీకరించలేదని సమాచారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి శిల్ప మాట్లాడుతూ.. ‘టాబ్లెట్లు, పౌడర్లు వాడటం, కడుపు కట్టుకోవడం వల్ల బరువు తగ్గుతారనే మాటలను నేను నమ్మను. పాటించను. అలాంటప్పుడు ఇలాంటి ఉత్పత్తులకు నేను ప్రచారకర్తగా ఎలా వ్యవహరిస్తాను. ఆహారంలో కొద్ది పాటి మార్పులు, క్రమం తప్పక వ్యాయామం చేస్తూంటే ఆలస్యమైనా సరే తప్పక బరువు తగ్గుతాం. ఇందుకు నేనే ఉదాహరణ. అంతే తప్ప ఇలాంటి ఉత్పత్తులను అంగీకరించను, ప్రోత్సాహించను’ అన్నారు.

శిల్ప ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనే విషయం అందరికి తెలిసిందే. ఫిట్‌నెస్‌, ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలకు సంబంధించి శిల్ప ఒక యాప్‌ను కూడా తీసుకొచ్చారు. ఆహార నియమాలు, ఫిట్‌నెస్‌ సలహాలను ఈ యాప్‌ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. ఇక వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాతో వివాహం అయ్యాక సినిమాలకు దూరమైన శిల్పాశెట్టి.. దశాబ్దకాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. షబ్బీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న ‘నికమ్మ’తో శిల్ప బాలీవుడ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిచనున్నారు.

SHARE

LEAVE A REPLY