” సైరా” చిత్ర సెట్ కూల్చేసిన రెవెన్యూ అధికారులు

0
540

Times of Nellore (Hyderabad) – అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా యాక్షన్‌ సన్నివేశాల షూటింగ్‌ పూర్తయింది.

కాగా ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ సినిమా సెట్‌ను షేర్‌లింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ‘సైరా’ సినిమా కోసం సెట్‌ వేశారని పేర్కొంటూ ఆ నిర్మాణాన్ని కూల్చి వేశారు. అప్పటికే ఆ ప్రభుత్వ స్థలంలో రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ సినిమాకు సంబంధించి గ్రామం సెట్టు ఉంది. అందులోనే ఒక భాగంలో సైరా నర్సింహారెడ్డి నివాసానికి సంబంధించి చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటి సెట్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో సెట్‌ ఏర్పాటుకు అనుమతి లేదని జేసీబీలను తీసుకువచ్చి కూల్చివేశారు. దీంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడిందట.

సోమవారం (జులై 30) ‘సైరా’ సినిమా సెట్‌లో తీసిన ఫొటోలు లీక్‌ అయ్యాయి. సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY