‘గొంతునిండా అమృతం నింపుకొన్న స్వరం ఆయనది’

0
58

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-సినీ సంగీత ప్రపంచంలో ధ్రువ తారలా నిలిచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. గత కొద్దివారాలుగా చికిత్స పొందుతున్న ఆయన.. కొలుకుంటారని ఆశించినట్లు చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పవన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.
పాట ఆత్మను ఆవాహన చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలు అని.. గొంతు నిండా అమృతం నింపుకొన్న స్వరం ఆయనదని కొనియాడారు. ఏ భాషలోనైనా ఏ తరహా గీతాన్నైనా అలవోకగా ఆలపించి సంగీత ప్రియులను ఉర్రూతలూగించారని పవన్‌ గుర్తు చేసుకున్నారు.

బాలుకి తెలుగు భాషపై ఉన్న మమకారం.. పదాన్ని తప్పుల్లేకుండా పలకాలనే తపన నవతరం గాయకులకు ఆదర్శప్రాయమైనవని పవన్‌ కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన సొంతమన్నారు. తన చిత్రాల్లో ఎన్నో హిట్ గీతాలను ఆలపించారని.. తమ కుటుంబంతో బాలు ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి తనతోపాటు జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY