ఇంత గొప్ప ఆదరణ వస్తుందని మాత్రం నేను ఊహించలేదు!

0
129

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –ఇస్రో చేపట్టిన మార్స్‌ యాత్ర నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. ఈ చిత్రం తీయడం తమకు అంత సులభమేమీ కాలేదని.. దీనికోసం ఎంతో సాహసం చేశామని కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ వెల్లడించారు. సైన్స్‌ ఫిక్షన్‌గా రూపొందించిన ఈ చిత్రం భారత చలనచిత్ర పరిశ్రమలోనే తొలి సినిమా అన్నారు. ముంబయిలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం తీస్తున్నామని తెలియగానే.. అనేకమంది దీనితో పెద్దగా కలెక్షన్స్‌ రావు. రూ.60-70 కోట్లు వరకు దాటొచ్చు అన్నారు. ఇలాంటి చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండదనే ఉద్దేశమే అందుకు కారణం కావొచ్చు. ఈ చిత్రం తీయడం ఓ పెద్ద రిస్క్‌. సైన్స్‌తో ముడిపడి ఉన్న ఈ చిత్రం ఎలా ఆడుతుందో, ప్రేక్షకులు కూడా దీనికి ఎలా ప్రతిస్పందిస్తారో నాకు తెలియదు. కానీ రిస్క్‌ చేసి తీశాం. భారత చలనచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా తీసిన మిషన్‌ మంగళ్‌కు ఇంత గొప్ప ఆదరణ వస్తుందని మాత్రం నేను ఊహించలేదు. ఈ చిత్రంలో పనిచేసినందుకు గర్విస్తున్నా. అలాగే, ఓ కొత్త శైలి చిత్రాన్ని తీసేందుకు వీలుగా చిత్ర పరిశ్రమకు సరికొత్త పంథాను అందించాం’’ అన్నారు.

ఈ తరహా సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు హాలీవుడ్‌లో అయితే 14 లేదా 15 మాత్రమే తీశారు. కానీ, మనకు ఇదే మొదటిది. తొలిసారి నేను సైన్స్‌ ఫిక్షన్‌ను ఎంచుకున్నా. ఇకపై ఇలాంటి చిత్రాలు ఇంకొన్ని వస్తాయి. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ చిత్రాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. చిన్నారులు ఈ చిత్రం చూడటమే కాకుండా తమ తల్లిదండ్రులను కూడా చూడాలని తీసుకొస్తున్నారు. సైన్స్‌ చాలా సులభమైందని చెప్పే ఉద్దేశంతోనే మేమీ చిత్రం తీశాం’’ అని అక్షయ్‌ కుమార్‌ వెల్లడించారు.

2013లో భారత్‌ చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు. విద్యాబాలన్, నిత్యామేనన్, సోనాక్షిసిన్హా, తాప్సి తదితరులు నటించారు. జగన్‌శక్తి దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

SHARE

LEAVE A REPLY