మాజీ మంత్రిని ట్యాగ్‌ చేశా.. సారీ- అనసూయ!

0
206

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ ట్విటర్‌లో క్షమాపణలు కోరారు. పొరపాటున మాజీ మంత్రి జోగు రామన్నను ట్యాగ్‌ చేసినట్లు పేర్కొన్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తాజాగా ఆమె స్పందించారు. ‘ఇప్పుడే యురేనియం తవ్వకాల గురించి వివరాలు తెలుసుకున్నా. విద్యుత్‌ ఉత్పాదకత కోసం యురేనియం కావాలట. కాబట్టి సహజంగా పీల్చే స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లని చంపుతున్నారు. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల ద్వారా రానున్న రోజుల్లో కొనుక్కునే వాళ్లకే పీల్చే గాలి… లేకపోతే ఊపిరి ఆడకచావాలి. అంతేనా??.. ఇదేగా మన భవిష్యత్తు?యురేనియం తవ్వకానికి అనుమతులు ఎలా ఇచ్చారు సర్‌? ఆలోచించడానికి భయం వేయలేదా?. దయచేసి దీన్ని ఆపండి. నల్లమల అడవుల్ని కాపాడండి’ అని ఆమె ట్వీట్లు చేశారు. దీంతోపాటు ఏపీ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌, కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌తోపాటు పొరపాటున తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్నను కూడా ట్యాగ్‌ చేశారు. తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి బదులు జోగు రామన్నను ఆమె ట్యాగ్‌ చేశారు.

దీంతో అనంతరం మరో ట్వీట్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు. ‘జోగు రామన్న సర్‌ను తప్పుగా ట్యాగ్‌ చేసినందుకు క్షమించండి. ప్రస్తుత వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన లేదు, వీటి అవసరం వస్తుందని అనుకోలేదు. ఇంద్రకరణ్‌ రెడ్డి సర్‌ మా విన్నపాల్ని, అభిప్రాయాల్ని అర్థం చేసుకోండి’ అని అనసూయ పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY