అన్నయ్య తో కలసి నటించాలి – కార్తీక్

0
621

Times of Nellore  (Chennai) – అన్నయ్య సూర్యతో కలిసి నటించాలనుందని కార్తీ పేర్కొన్నారు. నటుడు సూర్య తాజాగా తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కడైకుట్టి సింగం. ఇందులో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ముంబై బ్యూటీ సాయేషాసైగల్, ప్రియ భవానీశంకర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సత్యరాజ్, సూరి, భానుప్రియ, శ్రీమాన్, సరవణన్, ఇళవరసు, మారిముత్తు, జాన్‌విజయ్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి పసంగ పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో అవిష్కరణ సోమవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ దర్శకుడు పాండిరాజ్‌ ప్లాన్‌గా చిత్రాన్ని పూర్తి చేశారని చెప్పారు.

ఇందులో 28 మంది ప్రముఖ నటీనటులను నటించారని, అందరికీ ప్రాముఖ్యత ఉండేలా దర్శకుడు పాత్రలను తీర్చిదిద్దడం తనకే అశ్చర్యం కలిగించిందన్నారు. ఈ చిత్రం నగరంలో పని చేసేవారందరిని గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేయిస్తుందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు. డీ.ఇమాన్‌ సంగీతంలో తాను నటించిన తొలి చిత్రం కడైకుట్టి సింగం అని తెలిపారు. ఆయన మంచి పాటలను అందించారని చెప్పారు. అన్నయ్య నిర్మించే చిత్రంలో తాను హీరోగా నటిస్తానని ఊహించలేదన్నారు. అన్నయ్యతో కలిసి నటించాలని ఉందని అన్నారు. తనకు అక్క అంటే చాలా ఇష్టం అని షూటింగ్‌ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి కాఫీ చేసి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో నటుడు శివకుమార్, సూర్య, సత్యరాజ్, సూరి, శ్రీమాన్, నటి సాయేషాసైగల్, ప్రియ భవానీశంకర్, 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ సహ నిర్మాత రాజశేఖర్‌ కర్పూర పాండియన్‌ పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY