ఇంట్లో మిత్రుడు.. ఒంట్లో శత్రువు..!!

0
65
Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –ఉదయాన్నే లేచి టూత్‌బ్రష్‌ నోట్లో పెట్టుకుంటాం! తలుపు దగ్గర పడి ఉన్న పాల ప్యాకెట్లు అందుకుంటాం! బాక్స్‌లో లంచ్‌ సర్దుకుంటాం! బాటిల్‌లో నీళ్లు నింపుకుంటాం! ఆఫీసు నుంచి ఇంటికొస్తూ టీ తాగుతాం! ఓవెన్‌లో పదార్థాలు వేడి చేసుకుని తిని పడుకుంటాం! ఒక్క రోజులో చేసే ఈ పనుల్లో ఎన్ని ప్లాస్టిక్‌ వస్తువులు వాడుతున్నామో గ్రహించారా? ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణం కంటే ఎక్కువగా మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి! ఇంత ప్రమాదకరమైన అంశాలు ప్లాస్టిక్‌లో ఏం ఉన్నాయి? వాటి వల్ల ఆరోగ్యం మీద, పునరుత్పత్తి వ్యవస్థల మీద పడే దుష్ప్రభావాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే..?
ఇరవై ఏళ్ల క్రితం స్త్రీపురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు 15 శాతం మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ సమస్యలు 50 శాతానికి చేరాయి. ఇందుకు ప్రధాన కారణం జీవితంలో క్రమేపీ పెరిగిపోయిన అసురక్షితమైన ప్లాస్టిక్‌ వాడకమే! ప్రారంభంలో మంచినీళ్ల బాటిళ్లకే పరిమితమైన ప్లాస్టిక్‌ లంచ్‌ బాక్స్‌లు, టీకప్పులు, ప్లేట్లు, ఆఖరుకు పదార్థాల ప్యాకేజింగ్‌లోకి కూడా ప్రవేశించింది.
సముద్రాల్లో పేరుకునే ప్లాస్టిక్‌, చెత్తలో పేరుకున్న ప్లాస్టిక్‌ వల్ల జంతువులు చనిపోతున్న వార్తలు, వీడియోలు చూసి అయ్యో పాపం! అనుకుంటూ ఉంటాం! పర్యావరణ నష్టం నివారించడం కోసం ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించే ప్రయత్నాల్లో పడ్డాం! నిజానికి మనకు తెలియకుండానే, పలు రకాల వస్తువుల ద్వారా, ప్లాస్టిక్‌ మన దైనందిన జీవితంలో భాగం అయిపోయింది. పిల్లలు ఆడుకునే ఆటవస్తువుల మొదలు, పెద్దలు వాడే పెన్నుల వరకూ, ఆఖరుకు షాపుల్లో అందుకునే బిల్లుల వరకూ ప్రతి వస్తువులో ప్లాస్టిక్‌ ఉంటోంది. ఈ వస్తువులతో పని లేకుండా రోజు గడవడం కష్టం. అలాగని తెలిసి తెలిసీ వాటిని వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కూడా సరికాదు. కాబట్టి ప్లాస్టిక్‌, దానిలో ఉండే హానికారక రసాయనాలు, వాటి ప్రభావాలు, ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల గురించిన అవగాహన ఏర్పరుచుకోవడం మేలు అని వైద్యులు అంటున్నారు. ప్లాస్టిక్‌ మన్నిక పెరిగేకొద్దీ దానిలో హానికారక రసాయనాల శాతం తగ్గుతుంది అంటున్నారు. ఇంతకీ ప్లాస్టిక్‌ ఎందుకు అంత ప్రమాదకరం?
హార్మోన్లకు శత్రువులు!
ప్లాస్టిక్‌తో తయారైన వస్తువుల్లో ఉండే రసాయనాలు (బిస్ఫినాల్‌ ఎ) శరీరంలో హార్మోన్‌ వ్యవస్థను ఛిద్రం చేస్తాయి. కాబట్టే వాటిని ‘ఎండోక్రైన్‌ డిజ్‌రప్టర్స్‌’ అని అంటారు. ఈ రసాయనాలు థైరాయిడ్‌, ఈస్ట్రోజెన్‌, ఆండ్రోజెన్‌ హార్మోన్లను అనుకరిస్తాయి. అంతే కాదు. ఈ ‘ఎండోక్రైన్‌ డిజ్‌రప్టర్స్‌’ ఏకంగా మన ఒంట్లోని, నిజమైన హార్మోన్ల తయారీ, వాటి స్రావం, ప్రవాహం, పనితీరు, ప్రభావాలను మార్చేస్తాయి. దాంతో సిసలైన హార్మోన్లలో అవకతవకలు ఏర్పడి, పలు రకాల ఆరోగ్య సమస్యలతో పాటు, ప్రధానంగా పునరుత్పత్తి సమస్యలు మొదలవుతాయి. దాంతో మహిళల్లో అండాల తయారీ, పురుషుల్లో వీర్యకణాల తయారీ తగ్గుతుంది. వీటితో పాటు ఇతరత్రా సమస్యలూ తలెత్తే వీలుంది. అవేంటంటే….
మహిళల్లో రొమ్ము కేన్సర్‌, పురుషుల్లో ప్రోస్టేట్‌ కేన్సర్‌
పిల్లల్లో, పెద్దల్లో ఒబేసిటీ
రక్తనాళాలు సన్నబడడం మూలంగా హృద్రోగ సమస్యలు
ఎలర్జీలు, ఆస్తమా
పురుషుల్లో నపుంసకత్వం, లైంగిక సమస్యలు
మహిళల్లో పిసిఒడి (పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌)
టైప్‌2 డయాబెటిస్‌
వేడి కూడదు!
ప్లాస్టిక్‌ వస్తువుల్లో ప్రమాదకర ‘బిస్ఫినాల్‌’ రసాయనం దాగి ఉంటుంది. ప్లాస్టిక్‌ వేడికి గురయినప్పుడు ఈ రసాయనం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సాధారణంగా సూపర్‌ మార్కెట్‌లలో దొరికే టమాటో కెచప్‌ లాంటి ప్రతి క్యాన్డ్‌ ఫుడ్‌ కూడా ప్లాస్టిక్‌ సీసాలు, డబ్బాల్లోనే దొరుకుతుంది. ఈ నిల్వ పదార్థాలను ప్లాస్టిక్‌ సీసాలో నింపేటప్పుడు, మూతను స్టెరిలైజ్‌ చేస్తారు. ఆ క్రమంలో వేడి వెలువడి, ప్లాస్టిక్‌లోని ప్రమాదకర రసాయనాలు పదార్థాల్లో కలుస్తాయి.
సూపర్‌ మార్కెట్‌లో మినరల్‌ వాటర్‌ బాటిల్‌ కొంటూ ఉంటాం. కానీ ఆ బాటిళ్లు షాపు చేరేలోపు ఎంతసేపు ఎండకు గురయ్యాయి. షాపులో వాటిని నిల్వ చేసే జాగా లేక, బయట ఉంచి, తర్వాత ఫ్రిజ్‌లో పెట్టారా? అనేది ఎవరికి తెలుసు?
ఆకర్షణీయమైన రంగుల్లో దొరికే ప్లాస్టిక్‌ లంచ్‌ బాక్స్‌ల్లో పదార్థాలు సర్దుకుంటున్నాం! కానీ పదార్థాలు చల్లారేంత సమయం ఆగుతున్నామా? ఓవెన్‌లో పదార్థాలు వేడిచేసే పాత్రలు ప్రధానంగా ప్లాస్టిక్‌తోనే తయారవుతూ ఉంటాయి. పిల్లలు ఆడుకునే వస్తువుల్లో 90ు ప్లాస్టిక్‌వే! అంతేకాదు… చివరకు కర్రీ పాయింట్‌ నుంచి కూరలు తెచ్చుకున్నా, టీ షాపు నుంచి టీ తెప్పించుకున్నా, వాటిని ప్యాక్‌ చేస్తున్నదీ ప్లాస్టిక్‌ కవర్లలోనే!
ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాలు ఇవే!
టూత్‌బ్ర్‌ష లాంటి కొన్ని ప్లాస్టిక్‌ వస్తువులకు ప్రత్యామ్నాయాలు (వేప పుల్ల) ఉన్నా ఉరుకులు పరుగుల జీవితంలో వాటిని పాటించడం కొంత కష్టం. కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించవలసి వచ్చే కొన్ని ప్లాస్టిక్‌ వస్తువుల్లో మేలైనవి, ‘బిపిఎ ఫ్రీ’ (బిస్ఫినాల్‌ ఫ్రీ)
రకానికి చెందినవే ఎంచుకోవాలి. ఆ వస్తువులు కొనే సమయంలో, లేబుల్‌ మీద ‘బిపిఎ ఫ్రీ’ అని రాసి ఉందో, లేదో గమనించాలి. సాధారణంగా ప్రసిద్ధ కంపెనీలు తయారుచేసే ప్లాసిక్‌ వస్తువులు ఈ కోవకే చెంది ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్‌ నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. అలాగే కొన్ని ప్లాస్టిక్‌ వస్తువులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ వస్తువులు ఎంచుకోవాలి. అవేంటంటే…
ప్లాస్టిక్‌ మంచినీళ్ల బాటిల్‌
ప్రత్యామ్నాయం: గాజు సీసా, స్టీలు లేదా రాగి బాటిల్‌
ప్లాస్టిక్‌ గిన్నెలు
ప్రత్యామ్నాయం: ఓవెన్‌లో గాజు లేదా పింగాణీ గిన్నెలే వాడాలి.
ప్లాస్టిక్‌ ప్లేట్లు
ప్రత్యామ్నాయం: స్టీలు, పింగాణీ ప్లేట్లలో భోజనం చేయాలి
ప్లాస్టిక్‌ కప్పులు
ప్రత్యామ్నాయం: స్టీలు, పింగాణీ కప్పులు
ప్లాస్టిక్‌ ఆట వస్తువులు
ప్రత్యామ్నాయం: సాఫ్ట్‌ టాయిస్‌
ప్లాస్టిక్‌ స్ట్రా
ప్రత్యామ్నాయం: స్టీలు స్ట్రా.
దిద్దుబాటు చర్యలు ఇవే!
ప్లాస్టిక్‌ నిషేధం అమలవుతున్నా, ఇప్పటివరకూ ఎంతో కొంత వాటి దుష్ప్రభావానికి గురయిపోయాం! ఆ ప్రభావం నుంచి బయటపడే మార్గాలను అనుసరించడం అవసరం. తద్వారా సంబంధిత దుష్ప్రభావాల నుంచి బయటపడే వీలుంది అంటున్నారు వైద్యులు!
ప్లాస్టిక్‌ మట్టిలో కలవడానికి సమారుగా వంద నుంచి నూట యాభై ఏళ్లు పడుతుంది. అంత సమయం పాటు భూగర్భంలో ప్లాస్టిక్‌ నుంచి కార్సినోజెన్స్‌ విడుదలవుతూనే ఉంటాయి. అదే భూమిలో పంటలు పండించి తినడం, ఆ పంటలే తిని పెరిగిన జంతువుల మాంసం తినడం మూలంగా అవి మన శరీరంలోకి చేరుతూ ఉంటాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎక్కువగా కలుస్తున్నది నీటిలోనే! ఆ నీటిలో పెరిగే సముద్రజీవులను తినడం మూలంగా కూడా విషాలు మన శరీరాల్లోకి చేరిపోతున్నాయి. దైనందిన జీవితంలో వాడే వస్తువుల సంగతి అందరికీ తెలిసిందే! ఇలా మన చుట్టూరా ప్లాస్టిక్‌ విషాలు నిండుకుని ఉన్నప్పుడు, అప్రమత్తంగా వ్యవహరిస్తూ, వాటి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి. స్టీలు, గాజు, పింగాణీ, రాగి, మట్టితో తయారైన వస్తువులను ప్లాస్టిక్‌ వస్తువులకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలి. అలాగే ప్లాస్టిక్‌ ప్రభావానికి గురవకుండా శరీరానికి రక్షణ కల్పించుకోవాలి. అందుకోసం…. విటమిన్‌ సి, ఇలు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఉసిరి, నిమ్మ, నారింజ వంటి నిమ్మజాతి పండ్లను దైనందిన ఆహారంలో చేర్చుకోవాలి.  వాల్‌నట్స్‌ తింటూ ఉండాలి. క్రమం తప్పక వ్యాయామం చేస్తూ ఉండాలి.
SHARE

LEAVE A REPLY