నేటి నుంచి ముత్యాలమ్మ జాతర – ముస్తాబైన తూర్పుకనుపూరు

0
1517

Times of Nellore ( Chillakur ) – వేనవేల మొక్కులు.. వేపమండలు.. వేయికళ్ల కుండలు.. భక్తుల జయజయధ్వానాల నడుమ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న చిల్లకూరు మండలంలోని తూర్పుకనుపూరులో వెలసియున్న ముత్యాలమ్మ జాతరకు తూర్పుకనుపూరు ముస్తాబైంది. ఉగాది పర్వదినానికి ముందు వచ్చే మంగళవారం జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పోలేరమ్మ నిలుపుతో జాతర ప్రారంభమై నాలుగురోజుల పాటు ఉత్సవం కొనసాగనుంది.

ఏటా నిర్వహించే జాతరకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయ ధర్మకర్తల మండలి, దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. భక్తులను అలరించేందుకు ఇప్పటికే పలురకాల దుకాణాలు, రంగులరాట్నాలు, ఇంద్రజాల ప్రదర్శనలు, తదితరాలు ఏర్పాటయ్యాయి. జాతరకు దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని పోలీసులు అంచనా వేస్తున్నారు. గూడూరు డీఎస్పీ పీఎస్‌ రాంబాబు పర్యవేక్షణలో పోలీసులు జాతర విధులను నిర్వహించనున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆలయ పరిసరాల్లో దాదాపు 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ ప్రత్యేకంగా జాతర కోసం వివిధ మార్గాల్లో తూర్పుకనుపూరుకు దాదాపు 150 బస్సులను నడపనుంది. గూడూరు- తూర్పుకనుపూరు, నెల్లూరు, ముత్తుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, నాయుడుపేట, కోట, వాకాడు, చిల్లకూరు సమీపానున్న వరగలిఅడ్డరోడ్డు కూడలి వద్ద నుంచి బస్సులు తూర్పుకనుపూరుకు భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పేర్నాటి ఆనందరెడ్డి, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్‌రెడ్డి, కమిటీ సభ్యులు తూర్పుకనుపూరులోనే మకాం వేసి జాతరకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

SHARE

LEAVE A REPLY