అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం

0
256

Times of Nellore ( Tirumala ) – తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం రథోత్సవం వైభవోపేతంగా సాగింది. మేరుపర్వతం వంటి రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు విశేషాలంకరణలతో ఆశీసులయ్యారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథం పగ్గాలను లాగగా … తిరువీధుల్లో రథోత్సవం సాగింది. వేలాది మంది భక్తులు తేరు పగ్గాలను పట్టుకొని రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఈ రాత్రి తొమ్మిది గంటలకు జరిగే అశ్వవాహనంతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి.

దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవం వర్ణనాతీతం. ఏటా బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు. తనను ఆశ్రయించిన భక్తకోటికి వరద హస్తుడై అభయమిస్తాడు. రథాన్ని అధిరోహించిన కేశవుణ్ణి దర్శించుకుంటే మళ్లీ జన్మనెత్తాల్సిన అవసరమే లేదంటారు. ప్రతి మనిషీ జన్మజన్మల సాధనతో అందుకోవాల్సిన పారమార్థిక పీఠం రథంపై స్వామివారిని చూస్తేనే లభిస్తుందని నమ్ముతారు. ముక్తి ఫలాన్ని భక్తులకు అందించే ఉత్సవమే బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు జరిగే రథోత్సవం. వేంకటాచల సానువుల్లో కొలువైన శ్రీనివాస ప్రభువు రథంపై ఎక్కి ముందుకు సాగుతున్న వేళ భక్తులంతా గోవింద నామ స్మరణ చేస్తూ తన్మయులవుతారు. ప్రతి భక్తుడూ స్వామి వారి రథాన్ని లాగడానికి అర్హుడే. ‘సర్వమానవాళీ సమానమే’నన్న సమతా సిద్ధాంతాన్ని ఈ ఉత్సవం ప్రతిబింబిస్తుంది. అందుకే రథోత్సవం భక్తులకు కన్నుల పండువ చేస్తుంది. శ్రీవారి వాహన సేవలు భక్తులకు పుణ్యాన్ని అందించడమే కాదు, జీవన మార్గాన్ని తీర్చిదిద్దుకునే జ్ఞానాన్నీ బోధిస్తుంది.

SHARE

LEAVE A REPLY