శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ

0
315

Times of Nellore (Tirumala) – తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి అంకురార్పణ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి ఈనెల 16 వరకు వైఖానస ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీవారి ఆలయంలోని పాత కల్యాణమండపంలో యాగశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మూలవర్లుకు 5, ద్వారపాలకులకు 1, విమాన వేంకటేశ్వరస్వామివారికి 1, శ్రీగరుడాళ్వారుకు, ఆలయ గోపురానికి కలిపి 2, శ్రీవరదరాజస్వామివారికి, ఆలయ గోపురానికి కలిపి 2, అన్నప్రసాద తయారీకి 1, పడిపోటు తాయారీకి 1, శ్రీవిష్వక్సేనుల వారికి 1, భాష్యకార్లకు 1, శ్రీయోగనరసింహస్వామికి, ఆలయగోపురానికి కలిపి 1, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారికి, శ్రీబేడి ఆంజనేయస్వామివారు, ఆలయగోపురానికి కలిపి 2, ఇతర వాస్తు హోమగుండాలు కలిపి మొత్తం 28 హోమగుండాలను రూపొందించారు. సాయంత్రం ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆలయంలోని స్వామివారి సేనాధిపతి శ్రీవిష్వక్సేనుల వారికి హారతి ఇచ్చి ఆలయ ప్రదక్షిణం గావించి ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేశారు. అక్కడ శాస్త్రోక్తంగా పుట్టమన్ను సేకరించి.. తిరిగి తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలోని పాలికల్లో నవధాన్యాలు పోసి అంకురార్పణ చేపట్టారు. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

SHARE

LEAVE A REPLY