తిరుమలలో.. దర్శనాలు నియంత్రిద్దామా..?

0
485

Times of Nellore ( Tirumala ) – తిరుమలలో ఏటా పరిమిత సంఖ్యలో దర్శన అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందో ప్రజలు సూచనలు ఇవ్వాలని దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కోరారు. ఈ అంశాన్ని ప్రజల ముందు చర్చకు పెడుతున్నామని, ఇంకా ఎలాంటి విధాన నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. ఏడాదికి ఎన్నిసార్లు దర్శనం కల్పిస్తే బాగుంటుంది? భక్తులు మరింత సులభంగా దర్శనం చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలన్నారు. అమరావతిలోని సచివాలయంలో సోమవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సాంకేతికత ఆధారంగా ఆధార్‌ను లింకు చేస్తూ తరచూ వచ్చేవారు కాకుండా కొత్తవారికి తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలియజేయాలన్నారు. వీఐపీలకు కూడా ఇది వర్తింపజేస్తామని, సిఫార్సు లేఖలే లేకుండా చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు. తిరుమలలో అమలు చేస్తున్న శ్లాట్‌ విధానాన్ని రాష్ట్రంలోని మిగిలిన ప్రముఖ ఆలయాల్లోను త్వరలోనే అమలు చేయనున్నామని చెప్పారు. దర్శన సమయానికి గంట ముందు క్యూ లైన్లోకి వెళ్లేలా సమయం నిర్దేశిస్తామని చెప్పారు. దివ్యదర్శనం కార్యక్రమం కింద ఈ ఏడాది నుంచి 1.3లక్షల మందికి అమలు చేయనున్నామని చెప్పారు. రవాణా, వసతి, దర్శనం అన్నీ ఉచితంగానే కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం దేవాదాయ, ధర్మాదాయశాఖగా వ్యవహరిస్తున్న తమశాఖ పేరును మారుస్తున్నామని మంత్రి చెప్పారు. దేవాలయాలు, ధర్మ సంస్థల నుంచి ప్రభుత్వానికి ఆదాయం సంపాదించే శాఖగా ఇది అర్థం వస్తోందని అందుకనే మార్పు చేస్తున్నామని చెప్పారు. పండితుల సూచన మేరకు సీఎంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక నుంచి దేవదాయ, ధర్మదాయశాఖగా వ్యవహరించనున్నట్లు మాణిక్యాలరావు వివరించారు. ఈ శాఖలో పనిచేసే ఆలయ ఉద్యోగులు ఆనారోగ్య కారణాల వల్ల ఉద్యోగాలకు దూరమైతే వారి ఇంట్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం కల్పించేలా ఉత్తర్వులు ఇస్తున్నట్లు చెప్పారు.

SHARE

LEAVE A REPLY