శ్రీవారి ఆలయంలో 24నుంచి జ్యేష్టాభిషేకం

0
320

Times of Nellore ( Tirumala ) – తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం జరగనుంది. ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టానక్షత్రానికి ముగిసేవిధంగా మూడు రోజుల పాటు ఈ అభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో ఈ ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు. దీనినే అభిధ్యేయక అభిషేకం అని కూడా అంటారు. అభిషేకాది క్రతువులతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవం చేపడతారు. ఇందులో భాగంగా తొలి రోజు మలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తొలగించి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తరువాత స్వామికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండు, మూడు రోజుల్లో కూడా హోమాలు, అభిషేకం నిర్వహించి వరుసగా ముత్యాలకవచం, స్వర్ణకవచంతో తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. అప్పటి నుంచి వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం వరకు మలయప్పస్వామి బంగారు కవచంతోనే ఉంటారు. ఈ సందర్భంగా 26న అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం రద్దు చేశారు.

SHARE

LEAVE A REPLY